మ్యాప్‌లో ఆ నీలి చుక్క నా వైపు దూసుకొస్తుంటే,
నా గుండె చప్పుడు లయ తప్పి ఉరుకులు పెట్టింది!
పది కిలోమీటర్ల దూరాన్నే అడ్డుకున్న నీ ఆంక్షలు,
వంద మీటర్ల దగ్గరకు రాగానే ఆవిరైపోయాయి.
మాసిన గెడ్డం, చింపిరి జుట్టు, సాధారణ దుస్తులు..
కానీ నిన్ను చూడాలన్న నా తపన ముందు అవేవీ గుర్తురాలేదు!
కెమెరా కన్నుల నుండి కాకుండా, కళ్ళతో నేరుగా నిన్ను చూసే వేళ,
నా పాదాలు నేలను తాకడం మరిచిపోయాయి.
కల్వరీ చర్చి ముంగిట నిలబడిన నా ముందు...
నలుపు రంగు దుస్తుల్లో మెరిసిన నల్లని మేఘానివి నువ్వు!
నీలి రంగు వాహనంపై అలా వచ్చి ఆగినట్లు ఆగి,
ఒక్క "Hi" తో నా సర్వస్వాన్ని నీ వెంటే తీసుకెళ్ళావు.
దేవుడు ప్రత్యక్షమైన వేళ ఏం అడగాలో తెలియని భక్తుడిలా,
నా మాటలు పెదవుల దాటక ముందే మాయమయ్యాయి.
ఒక "Hi", ఒక "Bye".. అవే నా లోకమయ్యాయి,
కానీ అసలైన దృశ్యం ఆ ములుపు దగ్గర మొదలైంది!
కొద్ది అడుగుల దూరం వెళ్ళి, మాస్కు తీసి వెనుతిరిగి చూసిన నీ మోము..
నా కనురెప్పల మధ్య శాశ్వతంగా ఒక చిత్రంలా మిగిలిపోయింది!
మూడు నెలల నిరీక్షణ, పది నిమిషాల ప్రయాణం,
నీ ఒక్క చూపుతో నా శ్వాస మళ్ళీ చిగురించింది.
నువ్వు కనుమరుగైనా నా చూపులు ఆ రోడ్డునే వెతుకుతున్నాయి,
నువ్వు వదిలివెళ్ళిన జ్ఞాపకం నాలో మౌనంగా నవ్వుతోంది.
విధి నిన్ను కలిపిందో లేదో తెలియదు కానీ,
నా ప్రాణం నా కళ్ళముందు నడిచి వెళ్ళిన క్షణం ఇది!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి