నీ జ్ఞాపకాల పరిమళం నా శ్వాసలో నింపుతూ.. చెబుతున్నా శుభాకాంక్షలు

ప్రేమ లోకంలో నువ్వు వెలిగిపోవాలని కోరుకుంటూ.. చెబుతున్నా శుభాకాంక్షలు |


నిన్ను పసిపాపలా చూసుకునే పచ్చని మనసున్నవాడు

నీ చిలిపి అల్లరికి మురిసిపోయి, నీ పెంకితనాన్ని భరించేవాడు


కోపం అంటే తెలియనివాడై, బాధ దరిచేరనివ్వని తోడై

కంటనీరు రానివ్వక నిన్ను అపురూపంగా దాచుకునేవాడు


నీ ముందర శృంగార సామ్రాజ్యాన్ని పరిచే ప్రియుడై

ప్రతీ క్షణం నీ కొంగు పట్టుకుని నీ వెంటే తిరిగేవాడు


ఆధునిక విలాసాల నడుమ యాంటిక్ సొగసుల జీవనం పంచుతూ

నీ ఒళ్ళో తలపెట్టి నిత్యం తీయని ఊసులు చెప్పేవాడు


నువ్వు చెప్పే కబుర్లకు 'ఓ' కొడుతూ, కాలం తెలియకుండా చేస్తూ

నీ జీవితాన్ని ప్రతి క్షణం స్వర్గంలా మార్చే ప్రాణమై నిలిచేవాడు


మర్చిపోలేని అనుభూతులు మిగిల్చినందుకు మనసారా కృతజ్ఞతలు

నీ సంతోషాన్ని నిత్యం కోరే నేను.. నీ అందమైన ప్రయాణానికి ఎప్పటికీ ఆటంకం కాను.


వచ్చే ప్రేమికుల రోజు నాటికి నీ కలల రాజకుమారుడితో నువ్వు ఉండాలి

నీ సంతోషాన్ని నీ కనులకు కనిపించని దూరం నుంచి ఈ సూర చూడాలి.