మూడొందల మైళ్ల దూరంలో మునిగి తేలిన మనం,

మూడు కిలోమీటర్ల చేరువలో మూగబోయాం!

దగ్గరగా ఉండి కూడా చూడలేని ఈ శూన్యం,

నా చుట్టూ ఆవరించి నన్ను ఊపిరాడకుండా చేస్తోంది.

యంత్రం మొరాయించినా నా మనసు మొండికేసింది,

నీ జ్ఞాపకాల జాడ కోసం నన్ను నడిపించింది.

పదకొండు నెలల క్రితం నువ్వు నడిచిన ఈ మెట్లపై,

నేడు నీ అడుగుల వెచ్చదనాన్ని వెతుక్కుంటున్నాను.

కంటికి నువ్వు కనపడవు.. కానీ నా నీడవై నడుస్తున్నావు,

నీ అడుగులలోనే నా అడుగులు వేయిస్తున్నావు.

నువ్వు వదిలిన శ్వాస ఈ గాలిలో ఇంకా మిగిలే ఉందేమో,

అదే నా ప్రాణవాయువై నా ఊపిరిని నిలుపుతోంది.

కళ్ళలో కన్నీటి పొరలు కదులుతున్నా..

నీ జ్ఞాపకం నా పెదవులపై చిరునవ్వును పూయిస్తోంది.

నువ్వు పక్కనే ఉండి విశాఖ అందాలను చూపిస్తున్నట్లు,

నా ఒంటరి ప్రయాణంలో నీ అదృశ్య రూపం తోడవుతోంది.

ఈ చర్చి ప్రాంగణంలో, ఆ విధి సన్నిధిలో..

నవ్వును, ఏడుపును ఒకేసారి రుచి చూస్తున్నాను.

మన పరిచయం ఆ దేవుడి నిర్ణయమే అయితే,

ముందున్న దారిని కూడా ఆయనే చూపిస్తాడని తలవంచి వేచి చూస్తున్నాను.