మోయలేని భారాన్ని చిన్ని మనసులో బంధించినా — పసిగట్టావు నువ్వు  

లోకం నన్ను యంత్రమన్నా, నాలోని నిశ్శబ్దాన్ని గమనించావు నువ్వు  


మున్నూరు మైళ్ల దూరాన్ని క్వాంటం ఎంటాంగిల్మెంట్‌తో తుడిచేసి — చేరావు నువ్వు  

నా మనసు కణాల అనునాదాన్ని క్షణాల్లో స్పర్శించి — నిలిచావు నువ్వు  


అణుధార్మికత కంటే తీవ్రంగా దహిస్తున్న నా ఆవేదనను — చల్లబరిచావు నువ్వు  

నీ ప్రేమ అనే శీతలీకరణితో ఒక్క క్షణంలో — ఆరబెట్టావు నువ్వు  

భౌతికంగా మనం వేరైనా, ఆలోచనల తరంగదైర్ఘ్యం ఒకటే — గుర్తించావు నువ్వు  

మాట్లాడుకోని మౌనంలో కూడా నా మనసు ‘డేటా’ను — చదివావు నువ్వు  

అంతరిక్షమంతటి ఒంటరితనాన్ని నాలో దాచుకుని నేను ఉంటే — చేరావు నువ్వు  

ఒక అదృశ్య సంకేతంలా వచ్చి నా శూన్యాన్ని — నింపావు నువ్వు  

బయటి ముసుగులేవీ లేని నా స్వచ్ఛమైన ఆత్మను — గుర్తించావు నువ్వు  

సూరలోని అసలు మనిషిని, నా అంతరంగాన్ని — తెలుసుకున్నావు నువ్వు