ఉల్లాసపు విశాఖ నేడు మూగబోయింది,

నువ్వు చేరువగా ఉన్నా మాట కరువైపోయింది.

కానీ...

నిశ్శబ్దాన్ని చీలుస్తూ వచ్చిన ఆ మెసేజ్,

నా వెనుతిరిగిన ఆశలకు ఊపిరి పోసింది!

​"నిన్ను చూడాలని ఉంది" అన్న నీ ఒక్క మాట,

కలలా ఉందో, లేక ఇదంతా మాయా అనుకున్నా!

ఉదయం 'వద్దు' అన్న పెదవులే ఇప్పుడు 'రా' అంటుంటే,

నిజమేనా అని ఒకటికి పది సార్లు చదువుకున్నా.

​నువ్వు వదిలిన జ్ఞాపకాల మత్తులో ఉన్నానా?

లేక విధి నాపై జాలిపడి నిన్ను చూపిస్తోందా?

నీ లొకేషన్ చూసిన క్షణమే నా ప్రాణం ఉరికింది,

స్తంభించిన నా లోకం మళ్ళీ వేగంగా కదిలింది.

​"పాసింగ్ క్లౌడ్ లా చూసి వెళ్ళిపోతాను" అన్నావు..

కానీ అది నా కళ్ళకు ఒక జీవితకాలపు దృశ్యం!

నీ అదృశ్య రూపం సాక్షాత్కరించే ఆ క్షణం కోసం,

నా గుండె వేగం విలయంగా మారుతోంది.

​క్షణం ఆలస్యం చేయక పరుగులు తీస్తున్నాను,

నీ ఆంక్షల పరిధిని దాటి నీ నీడను వెతుక్కుంటున్నాను.

ఇప్పటిదాకా తెలియని నీ రూపం కళ్ళముందు నిలిచే వేళ..

నా అడుగులు నేల మీద లేవు, ఆ అలుపు నాకు తెలియదు!