యంత్రంలా పనిచేస్తూ విఫలమైన బ్రతుకును, ప్రాణమున్న మనిషిగా మార్చేసింది!
భావాలే లేవనుకున్న నా రాతి గుండెను, అనురాగాల కడలిగా మార్చేసింది!
అట్టడుగున దాగియున్న జ్ఞాపకాలను తట్టి, కన్నీటి చారలను సున్నితంగా పసిగట్టి,
తనివితీరా ఏడ్చేలా కరిగించి, కోపాన్ని ఆవేదనల సెలయేరుగా మార్చేసింది!
స్నానాల గదిలోన రాగమైనా తీయని నా గొంతులో మౌనపు సంకెళ్లు తెంచి,
పజిల్స్ తో నా మెదడుకు మేతను పెట్టి, ఒక అందమైన పాటగా మార్చేసింది!
నిబంధనల ఇనుప చట్రంలో ఏనాడో బందీ అయిపోయిన నా మది చేత,
పదాలతో ప్రాణం పోయించి, దాన్ని సృజనాత్మక కవితగా మార్చేసింది!
ఏం జరిగినా పట్టనట్లు నిమ్మకు నీరెత్తినట్టు, చలనం లేని నా రూపును,
ఒక్క క్షణం తన దర్శనం కోసమని, ఉరకలెత్తే పరుగుగా మార్చేసింది!
నిరంతరం శ్రమించే యంత్రం కాదింక, ఈ సూర జీవితం ఇప్పుడు,
ప్రతి క్షణం ఆనందంతో ఆస్వాదించే, సజీవమైన వసంతంగా మార్చేసింది!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి