ఇరవై ఏళ్ళ నా మౌన రోదనను...

నీ అక్షరాలతో తడిమి, కన్నీరై పారించావు

ఊపిరితిత్తుల్లో ద్రవంలా పేరుకున్న నా వేదనను

నిట్టూర్పుగా మార్చి, నాకు ఊరటనిచ్చావు!


రాయిలా మారిన నా గుండెను

దూది కన్నా మెత్తగా మలిచావు

నాలో నిద్రపోయిన కవిని నిద్రలేపి

నా మూగ గొంతులో పాటవై పలికావు!


"బుజ్జి దెయ్యం" అంటూ నన్ను మురిపిస్తూ...

పాదరసంలా జారిపోయే నిన్ను

నా గుండెపై బంగారు ప్రతిమగా మార్చుకోవాలని..

నీలోని అస్థిరత్వానికి కారణమైన ఆ ప్రోటాన్‌ను తొలగించి..

నిన్ను నా గుండెల్లో బంధించాలని ఎంతగా తపించానో!


నీ వికర్షణ శక్తి నన్ను చేరువ కానివ్వదు

నా ఆకర్షణ శక్తి నిన్ను దూరం పోనివ్వదు

భూమి చుట్టూ తిరిగే ఆ చంద్రుడిలా...

నీ వికర్షణ శక్తి చివరి అంచున, ఈ 'సూర్య'

నీ చుట్టూ శాశ్వతంగా పరిభ్రమిస్తూనే ఉంటాడు!


ఊహల ఊయలలో నన్ను ఊగిస్తూ...

స్వర్గాన్ని నా కళ్లముందు నిలిపావు

కల్వరి చర్చి సాక్షిగా దర్శనమిచ్చి

రాస్ హిల్ కొండపై నీ చేతి ముద్దను రుచి చూపావు!


ముప్పై ఏళ్ళ లోకో షెడ్ సాక్షిగా...

నీ శ్వాసను నా ప్రాణవాయువుగా మార్చావు

బిగువైన కౌగిలిలో నన్ను బంధించి

నా మోడువారిన జీవితంలో శృంగార భావాలు నింపావు!


వెంకుపాలెం బ్రిడ్జి, తగరంపూడి సచివాలయం...

ప్రతీ చోటా నీ ఉనికిని నింపుకున్నాను

డాల్ఫిన్ హిల్ పై నీ వెనుక హత్తుకు కూర్చున్న క్షణం

యారాడ కొండపై నీ కౌగిలిలో కరిగిపోయిన సమయం...

నా జీవిత కాలపు నిధి ఈ జ్ఞాపకం!


నీ తెల్లని షర్ట్... నీ ఎంగిలితో తీపిగా మారిన రేగి వడియం

పచ్చని చిలుక ఈక... ఆ ఇంకు పెన్ను...

ఏ.ఆర్. రెహ్మాన్ పాటల పల్లవుల సాక్షిగా...

ప్రతీ అణువులోనూ నీ జ్ఞాపకాన్నే దాచుకున్నాను!


ఇది నా మొదటి ప్రేమికుల రోజు...

బహుశా, ఇదే ఆఖరిది కూడా కావచ్చు!

కానీ... నా బాధ్యతలు తీరే వరకు

నీ జ్ఞాపకాలే నాకు ప్రాణవాయువు.. నీ ఊసే నా ఊపిరి!


వాస్తవ ప్రపంచంలో నీ ఉనికి మాయమైనా...

నా ఊహల సామ్రాజ్యానికి నువ్వే మహారాణివి

నా జ్ఞాపకాలతో ప్రాణం పోసుకున్న నా ప్రియ సఖికి

నా బుజ్జి తల్లికి... నా ముద్దుల పెళ్ళానికి...

హృదయపూర్వక ప్రేమికుల రోజు శుభాకాంక్షలు!